‘అన్నమయ్యతో స్వామి మాట్లాడేవారు’

‘అన్నమయ్యతో స్వామి మాట్లాడేవారు’
పలు కైంకర్యాలు ప్రారంభించారు
వాగ్గేయకారుడికి ప్రాధాన్యం ఏదీ?
అన్నమయ్య వంశీయులు హరినారాయణాచార్యులు
తిరుమల , అక్టోబర్ 5 :

సృష్టి జరిగిన నాటి నుంచి మాధవుడు మానవునితో కలసి సంచరించేవారని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. కలియుగంలో పాపం పేరుకుపోయి.. లోకంలో అన్యాయాలు, అక్రమాలు పెరగడంతో మానవునితో ప్రత్యక్ష సంబంధాన్ని దైవం తెంచుకున్నదట. మనిషి కోసం భువికేగిన ఆ దైవం చివరకు పరానికే పరిమితమైపోయిందట. అయితే ఈ పరిస్థితుల్లో కూడా దైవంతో ముఖాముఖి మాట్లాడిన వ్యక్తి ఒకరున్నారు. ఆయనే వేంకటేశ్వరస్వామికి పరమభక్తుడు తాళ్లపాక అన్నమాచార్యులు. కలియుగ ప్రత్యక్ష దైవంగా స్వయంభువై ఏడుకొండలపై వెలిసిన శ్రీనివాసుడు అన్నమయ్య పాట కోసం పరితపించేవారని 12వ తరానికి చెందిన తాళ్లపాక వంశీయులు హరినారాయణాచార్యులు పేర్కొంటున్నారు. మంగళవారం ఆయన తిరుమలలో ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ అన్నమయ్య గురించి, తిరుమల వేంకటనాధుని గురించి పలు ఆసక్తికరమైన విశేషాలు ఇలా వివరించారు.

కైంకర్యాలకు ఆద్యుడు అన్నమయ్య

శ్రీవారికి ప్రస్తుతం నివేదించే పలు కైంకర్యాలకు ఆద్యులు తాళ్లపాక అన్నమాచార్యులు. స్వామిని మేల్కొలుపుతూ నిర్వహించే సుప్రభాత సేవ, కల్యాణోత్సవం, ఏకాంతసేవ అన్నమాచార్యులు ప్రవేశపెట్టినవే. అప్పట్లో ఆయన ఈ సేవలకు రూపకల్పన చేసి శ్రీవారిని సేవించారు.

సేవలు-కీర్తనలు
అలా స్వామివారికి పలు సేవలను నిర్ణయించిన అన్నమయ్య ఆయా సేవలకు అనుగుణంగా పలు కీర్తనలు ఆలపించి స్తుతించేవారట. సుప్రభాత సమయంలో ‘మేలుకో శృంగారరాయా..! మేటి మదనగోపాల..!’ ‘సకలము నీవే..! సర్వమూ నీవే..!’, ‘మేలుకోవయ్యా..! శ్రీవేంకటేశా..! మేలుకొని మమ్ము ఏలుకోవయ్యా..!’ తదితర కీర్తనలు ఆనాడు అన్నమయ్య గానం చేశారు. శుక్రవారపు సేవలో ‘కంటి శుక్రవారము గడియ లేడింట..’ కీర్తన ఆలపించారు. రాత్రి ఏకాంతసేవ సమయంలో ‘బ్రహ్మకడిగిన పాదము..!’,పొద్దుటినుంచి రాత్రివరకు జరిగే పూజలను వివరిస్తూ ‘షోడశ కళానిధికి షోడషోపచారములు..!’ కీర్తనలు రోహిణీ నక్షత్రం నాడు కృష్ణుని అవతారంపై ‘ముద్దుగారే యశోద.. ముంగిట ముత్తెము వీడు..!’ ‘ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని..’ తదితర కీర్తనలను ఆలపించారు. స్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణానక్షత్రం సమయంలో ‘ఆదిదేవా పరమాత్మా..!’, ‘హరినీవే సర్వాత్మకుడవు..’ కీర్తనలు పునర్వసు నక్షత్రము రోజు ‘రాముడు రాఘవుడు రవికులు డితడు,’ ఉయ్యాల సేవలో ‘అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు సేసె నీ వుయ్యాల…’ తదితర కీర్తనలను అన్నమయ్య రచించి ఆలపించారు. ఇలా ఆయన మొత్తం 32 వేల కీర్తనలు రచించారు.

ఈ భాగ్యం అన్నమయ్య ప్రసాదం
అన్నమయ్య వంశంలో పుట్టడం మాకు వరప్రసాదం. ఆ స్వామి సేవలో తరించే అవకాశం కేవలం అన్నమయ్య వంశీకులుగా మాకు లభించింది. సూర్యచంద్రులున్నంత వరకు అన్నమయ్య వంశీయులే తన కైంకర్యాలు చేయాలని ఆ స్వామి ఆజ్ఞాపించడం, తద్వారా ఆ మహద్భాగ్యం మాకు దక్కడం అనిర్వచనీయం. ఈక్రమంలోనే ప్రతిరోజూ సుప్రభాత సేవలో రాత్రి ఏకాంత సేవల్లో కీర్తనలు ఆలపిస్తూ శ్రీమలయప్పను మేల్కొలిపి, నిద్రపుచ్చుతూ, కల్యాణోత్సవంలో కన్యాదాతగా వ్యవహరిస్తూ స్వామివారి కైంకర్యాల్లో పాల్గొంటున్నాం.

ఉభయ దేవేరులు మా ఆడపడుచులు
కల్యాణోత్సవం ప్రారంభించినప్పుడు కన్యాదాతగా అన్నమయ్య వ్యవహరించారట. అందువల్ల ఉభయదేవేరులు మా ఇంటి ఆడపడుచులుగామేము భావిస్తాము. ప్రస్తుతం కల్యాణోత్సవంలో అన్నమయ్య వంశీకులమైన మేమే కన్యాదాతగా వ్యవహరించే అదృష్టం మాకు లభిస్తోంది. ప్రస్తుతం 30 కుటుంబాలకు చెందిన 200 మంది అన్నమయ్య వంశీయులం ఉన్నాం. నాతోపాటు తాళ్లపాక నాగభూషణం, రాఘవ అన్నమాచార్యులు స్వామివారి సేవల్లో పాల్గొంటున్నాము.

స్వామితో ముఖాముఖి
శ్రీవారితో అన్నమయ్య ముఖాముఖి మాట్లాడేవారని మా తాత ముత్తాతలు మాకు చెప్పారు. అప్పట్లో ఏకాంతసేవకు రెండు గంటలు ముందుగానే అన్నమయ్య స్వామి వారి చెంతకు వెళ్లేవారట. అక్కడ స్వామి వారు అన్నమయ్యతో పలు విషయాలపై చర్చించేవారట. లోకంలోని సంగతులను అడిగి తెలుసుకునేవారట. స్వామి వారి ప్రశ్నలకు సమాధానమిస్తూ అన్నమయ్య కొన్ని కీర్తనలు ఆలపించేవారట. ఒకనాడు శ్రీవారు ‘అన్నమయ్యా.. భక్తులు నన్నేమని పిలుస్తున్నారు..?’ అని అడిగారట. అప్పుడు అన్నమయ్య ‘మాధవా.. కేశవా.. మధుసూధనా..’ అనే కీర్తనను ఆశువుగా ఆలపించారట. మరోసారి ‘నాతో మాట్లాడుతున్నప్పుడు నిమిషానికి 32 సార్లు కళ్లుమూసుకుంటున్నావే.. రోజంతా కళ్లుతెరిచిఉంచుతున్న నాకన్నులు ఎంత నొప్పి పుడుతాయో తెలుసా..?’ అని అడిగారట. అందుకు అన్నమయ్య మాట్లాడుతూ స్వామి తమరు కన్నులు మూస్తే భక్తులు ఏమైపోవాలి..? అంటూ ‘చూడక మానవు చూచేటి కన్నులు’ అనే కీర్తనను గానం చేశారట. అలా అన్నమయ్య కీర్తన కోసం స్వామి ప్రయత్నించేవారట. అన్నమాచార్యులు మాత్రమే కాదు.. ఆయన తర్వాత మా ముత్తాత అనంతాచార్యులు, తాత శేషాచార్యులు కూడా శ్రీవారితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండేవారని మా పెద్దలు చెబుతుండేవారు.

అన్నమయ్యకు ఆదరణ కల్పించాలి
శ్రీవారి ప్రాశస్థ్యాన్ని లోకానికి చాటిచెప్పిన గొప్ప భక్తుడు, తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య. అలాంటి ఆయనకు ఆదరణ కల్పించాల్సిన అవసరం ఉంది. తిరుమల గిరుల్లో ఆయనకు తగినంత ప్రాధాన్యం కల్పించడం లేదు. ఇందుకు తితిదే చర్యలు చేపట్టాలి.

అన్నమయ్య మఠం స్థాపించాలి
తిరుమలలో ఎన్నో మఠాలు ఉన్నాయి. కానీ శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రుడైన అన్నమయ్య పేరిట మఠం లేదు. అలాగే ఉత్తరమాడ వీధి విస్తరణలో భాగంగా అన్నమయ్య మండపాన్ని తొలగించి పక్కగా కొత్త మండపాన్ని నిర్మించారు. ఆ ముఖ మండపానికి ప్రాకారం నిర్మించాలని తితిదే అధికారులకు ఏళ్లుగా మొరపెట్టుకుంటున్నాము. కానీ ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత ఛైర్మన్‌ బాపిరాజు, ఈవో ఎల్వీ సుబ్రమణ్యం ఈ మండపాన్ని నిర్మిస్తారని ఆశలు పట్టుకున్నాం. అలాగే అక్కడ అన్నమయ్య నివేదినకు ఒక గది, సామానులు భద్రపరుచుకునేందుకు మరో గది నిర్మించాలని కోరుకుంటున్నాం.

Tags: ముఖ్యమైన వార్తలు,
Advertisements

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/10/05/%e0%b0%85%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%ae%e0%b0%af%e0%b1%8d%e0%b0%af%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf-%e0%b0%ae%e0%b0%be%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: