పెద్దశేష వాహనంపై మలయప్ప విహారం

పెద్దశేష వాహనంపై మలయప్ప విహారం
తిరుమల , సెప్టెంబర్ 30 :

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవం స్వామివారి వాహన సేవల్లోనే తొలిరోజు ధ్వజారోహణం అనంతరం రాత్రి పెద్దశేషవాహనంపై శ్రీమలయప్పస్వామి విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. స్వామివారు ఒక్కొరోజు ఒక్కో వాహనంలో విహారిస్తూ సందేశాన్ని ఇస్తూ మానవాళిని చైతన్యం చేస్తారు. దివ్యమనోహర రూపంలో శ్రీవారి దివ్యతేజస్సును భక్తులు వాహన సేవలో తిలకించి తరించారు.
పెద్దశేషవాహనం …
శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆదిశేషుని తొలివాహనంతో వాహన సేవలు ప్రారంభం అవుతాయి. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా వుండేవాడు శేషుడు. శ్రీ వైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు. భూ భారాన్ని వహించేది శేషుడే. భూదేవి,శ్రీదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వరునికి వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిస్తారు. ఉభయదేవేరులతో ఏడుపడగల బంగారు శేషునిపై స్వామి ప్రసన్నంగా గోచరిస్తాడు. కలియుగంలో శేషుడు గోవిందరాజుగా, వెంకటాచలంగా, ఆయుర్వేద వైద్యుడు చరకుడుగా పాణీనీయభాష్యకర్త, యోగా సూత్ర వ్యాకర్త పతంజలిగా, విశిష్టాద్వైత ప్రచారకులు శ్రీరామునులుగా వివిధ రూపాలలో అవతరించినట్లు ప్రసిద్ధి.
తొలిరోజు…
బ్రహ్మాండనాయుకుని బ్రహ్మోత్సవాలకు నాందిగా తొలిరోజైన గురువారం సాయంత్రం 5.30 -6 గంటల మధ్య శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణం నిర్వహించారు. ముక్కోటి దేవతలకు సాక్షిగా ధ్వజస్థంభంపై గరుడపటాన్ని ఎగరవేసి ఉత్సవాలను ప్రారంభించారు. రాత్రి 9-11 గంటల మధ్య స్వామివారికి అత్యంత సన్నిహితుడైన ఆదిశేషునిపై స్వామివారిని ఊరేగించారు. ఈవాహనానే్న పెద్దశేషవాహనమంటారు. శేషవాహనం దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి, మానవత్వం, అంథుడి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయని స్వామివారు భక్తకోటికి సందేశాన్ని అందించారు. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామి పెద్దశేషవాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా వాహన సేవకు ముందు సైన్యంగా గజరాజులు, అశ్వాలు, కదులుతుండగా భక్తకోటి చేస్తున్న గోవిందనామ స్మరణలు, నృత్యాలతో తిరుమల గిరులు మారుమోగాయి. ఈ వాహన సేవలో టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు, ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం దంపతులు, జేఇఓలు శ్రీనివాసులు, వెంకట్రామిరెడ్డి, సివిఎస్‌ఓ ఎంకెసింగ్ తదితరులు పాల్గొన్నారు.

వెంకన్న వైభవం చూతము రండి

పవిత్ర గరుడ కేతనాన్ని స్వర్ణమయ ధ్వజస్తంభం అగ్రభాగాన ఆవిష్కరించడంతో తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు పద్నాలుగు భువనాలలోని ముక్కో టి దేవతలు, చరాచర సృష్టికి ఆహ్వానం పలుకుతూ వాయు, మనో వేగాలతో పయనించే గరుడధ్వజ సంకేతాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు. వైఖానస ఆగమోక్తంగా ఇంద్రాది అష్టదిక్పాలకులు, బేరీ దేవతలు, గంధర్వ, కిన్నెర, కింపురుషాది దేవగణాలు, సప్తలోక జీవులను స్వాగతిస్తూ లాంఛనంగా మంత్ర, తంత్ర, గద్య, పద్యాది స్తోత్రాలతో స్తుతించి గరుడ చిత్రపటాన్ని శ్రీవేంకటేశ్వరుని ఆలయ ప్రాకారంలోని ధ్వజస్తంభంపై మీన లగ్నంలో సాయంత్రం ఎగురవేశారు. అశేష భక్తజనులు జయజయధ్వానాలు చేస్తుండగా అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని విశిష్ట బ్రహ్మోత్సవాలకు నాంది పలికారు. కంకణ భట్టాచార్యులు క్రతువు నిర్వహించి వేద మంత్రోచ్ఛారణలతో మంగళ, తూర్యారావాలతో ఉత్సవ వైభవానికి పతాకావిష్కరణ చేశారు.

తిరుమలగిరుల్లో గురువారం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాల ప్రారంభానికి నాందిగా ధ్వజస్తంభంపై గురుడపటాన్ని అధిరోహించి ఎగురవేయడం ద్వారా ధ్వజారోహణం నిర్వహించారు. తొలుత ఆలయంలో స్వామివారికి నిత్యపూజల తర్వాత మధ్యా హ్నం ఊరేగింపు మొదలైంది. శ్రీవారి ఉత్సవరులైన మలయప్పస్వామి ఉభయనాంచారీ సమేతుడై, బంగారు తిరుచ్చిలో మాడవీధుల్లో ఊరేగారు. ఆయనతోపాటు అనంతడు, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి స్వాములు వేర్వేరు పల్లకీల్లో వేంచేశారు. వీరితోపాటు ధ్వజపటాన్ని ఊరేగిస్తు స్వామివారి బ్రహ్మోత్సవాలకు అష్టదిక్పాలకాధి దేవతలకు ఆహ్వా నం పలికారు. ఆలయం చేరుకున్న ఉత్సవర్లు ధ్వజస్తంభం ప్రాంతంలో వేంచేశారు. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజరోహణ జరిపారు. అంతకుముందు స్తంభంలో ప్రతిష్ఠించిన గరుడుడికి అభిషేకం, వస్త్ర సమర్పణ, నైవేద్యం తదితర పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా భక్తులకు గరుడ ప్రసాదాన్ని వితరణ చేశారు. అనంతరం తిరుమలరాయ మండపానికి చేరుకున్న ఉత్సవర్లకు ఆస్థానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బాపిరాజు, ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం, జేఈవో శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వేకువజామున 3.30 నుంచి ఉదయం 9గంటల వరకు స్వామివారు విశ్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మలయప్పస్వామి, శ్రీదేవి, భూదేవికి తిరుమంజనం, విశేషసమర్పణ గావించారు. స్వామి వజ్రాలంకారభూషితుడై భక్తులను శుక్రవారం అనుగ్రహించనున్నారు.

గరుడపటానికి తిరుమంజనం
ఉత్సవ వీధుల్లో అగ్రభూమిక పోషించేందుకు సన్నద్ధమైన గరుడుని సంతృప్తి పరుస్తూ గరుడ దండకంతో స్తోత్రపాఠాలు ఆలపించి చిత్రపటానికి తిరుమంజనం జరిపారు. అనంతరం పుష్పమాలాలంకృతుడిని చేసి ఉత్సవాలకు ఆరంభ సూచకంగా గంటానాథం చేశారు. మధ్యాహ్నం యాగశాలలో హోమాది కార్యక్రమాలను నిర్వహించి రుత్వికవరణం చేశారు. రాత్రి పెద్ద శేష వాహనంపై స్వామివారు మాడ వీధుల్లో ఊరేగుతూ దర్శనమిచ్చారు.

వాహనం చుట్టూ వేద విద్యార్థుల వలయం
బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడే విధంగా వేద విద్యార్థులు వాహనానికి ప్రత్యేకంగా వలయాన్ని ఏర్పాటు చేశారు. గతంలో వాహనం ముందు పోలీసులు, విజిలెన్స్, ఆలయ సిబ్బంది వలయంగా ఏర్పడి భక్తులను అదుపు చేసేవారు. ఈ సందర్భంగా భక్తులను నెట్టివేయడం అనుకోని సంఘటనలు ఎదురయ్యేవి. వీటిని నివారించడంతోపాటు వాహనం వద్దకు ఇతరులు ఎవ్వరూ ప్రవేశించేందుకు వీలులేకుండా, భక్తిభావం మరింత ఉట్టిపడేవిధంగా వేద విద్యార్థులను ఏర్పాటు చేశారు. తొలిరోజు వాహనంలో 67 వేద విద్యార్థులతో వలయాన్ని ఏర్పాటు చేశారు. వీరు వాహనం ప్రారంభం నుండి నాలుగు వేదాలతో పాటు శ్రీనివాస గజ్జెం పటిస్తూ వాహన ఊరేగింపులో ఆధ్యాత్మిక శోభ, భక్తి భావాన్ని పెంపొదించేలా వ్యవహరించారు.

సీసీ కెమెరాల నిఘా
తిరుమలలో భద్రతాపరంగా పటిష్ట ఏర్పాట్లు చేశారు. మొత్తం 66 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని ఆలయం ముందు ప్రత్యేకంగా నిర్మించిన మాస్టర్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసి నిఘా ఉంచారు.

మూడు వేల మందితో బందోబస్తు
3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్టోబర్ 3న గరుడ సేవకు మరో వెయ్యి మంది అదనపు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు.

Advertisements
Published in: on September 30, 2011 at 10:09 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/09/30/%e0%b0%aa%e0%b1%86%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%b6%e0%b1%87%e0%b0%b7-%e0%b0%b5%e0%b0%be%e0%b0%b9%e0%b0%a8%e0%b0%82%e0%b0%aa%e0%b1%88-%e0%b0%ae%e0%b0%b2%e0%b0%af%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: