భక్తుల్లో ఒక్కడు!

భక్తుల్లో ఒక్కడు!
తిరుపతి , జూన్ 15 :
సుమారు 55 ఏళ్ల వయసున్న ఓ మధ్య వయస్కుడు.. పంచకట్టు, నామాలబొట్టు, గుండుతో అచ్చం మన పక్కింటి బాబాయిలా కనిపించే పెద్దాయన సర్వ దర్శనంలో దాదాపు 18 గంటలు క్యూలో నడిచారు. సహచర భక్తుల సాధక బాధకాలను ఆద్యంతం పరిశీలించారు. తితిదే గురించి ఏమనుకుంటున్నారో.. ఏం ఆశిస్తున్నారో.. వారి నుంచి రాబట్టారు. ఆయన సర్వదర్శన యాత్ర తితిదేలో పెనుమార్పులకు నాంది పలికింది. ఆ ప్రముఖడు ఎవరోకాదు.. ప్రస్తుతం బదిలీ అయిన ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను కొంగున కట్టుకున్న తితిదే అగ్రగణ్య ఈవోల్లో ఒకరిగా ఐవైఆర్‌ కృష్ణారావు ప్రసిద్ధికెక్కారు.

వేళ్లూనుకుపోయిన దళారీ వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించే యత్నాల్లో భాగంగా అనూహ్య మార్పులకు నాంది పలికారు.
దర్శనంలో పాటిస్తున్న విధి విధానాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌లో రూ.కోట్ల అవినీతికి అడ్డుకట్ట వేశారు. శ్రీవారిని సమీపం నుంచి దర్శించుకునే లఘు దర్శనానికి చాలాకాలం తర్వాత సామాన్య భక్తులకు వెసులుబాటు కలిగింది ఆయన హయాంలోనే. దర్శనం అనంతరం భక్తులు మహాప్రసాదంగా భావించే లడ్డూలను కావల్సిన మేరకు పంపిణీ చేసే స్థాయిలో ఉత్పత్తిని పెంచారు.

బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక వినూత్న మార్పులను తీసుకువచ్చి భక్తులకు చేరువైన కృష్ణారావు కొన్ని కీలక నిర్ణయాలను ప్రతిపాదించి వివాదాలను కొని తెచ్చుకున్నారు. శ్రీవారి ఆలయంతో పాటు తితిదే పరిధిలోని మిగతా ఆలయాలను పురావస్తుశాఖ పరిధిలోకి తేవాలన్న ప్రయత్నం, విమాన వెంకటేశ్వరస్వామి దర్శనం వంటివి ఆ కోవలోకి వస్తాయి. కొండ మీదికి వచ్చే భక్తులను క్రమబద్ధీకరించేందుకు అలిపిరి వద్ద పెద్దఎత్తున ఏర్పాట్లను చేయాలని తలపెట్టిన దివ్యారామం, శ్రీవారి దర్శనంలో కదిలే తివాచీ వంటివి ప్రవేశ పెట్టాలన్న తపన కార్య రూపం దాల్చకుండానే బదిలీ అయ్యారు.
దళారీ వ్యవస్థ అంతం
ఆయన బాధ్యతలు చేపట్టేటప్పటికీ కొండమీద దళారీ వ్యవస్థ వేళ్లూనుకుపోయింది. అర్చన అనంతర దర్శనాలు (ఏఏడీ), సెల్లారు దర్శనాలు వంటివి వేల సంఖ్యలో దళారీల చేతిలో అమ్మకాలు సాగాయి. ముందుగా ఆయన వాటిపై దృష్టిపెట్టారు. సామాన్య, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని ప్రవేశపెట్టారు. టికెట్ల కౌంటర్లను దళారీ వ్యవస్థ చొరబాటుకు అవకాశం లేకుండా క్యూలైన్ల మధ్యలో ఏర్పాటు చేశారు. సామాన్య, మధ్య తరగతి భక్తులు ఎవరినీ ఆశ్రయించుకుండానే నేరుగా వెళ్లే అవకాశాన్ని కల్పించారు.

ముఖ్యులు, అతిముఖ్యులకు విరామ దర్శనం మినహా ఇతరులు దాదాపు 100 అడుగుల దూరం నుంచే శ్రీవారిని దర్శించుకోవాల్సిన పరిస్థితి కొన్నేళ్లుగా అమలవుతోంది. వారానికి రెండు రోజులైనా శ్రీవారిని సమీపం నుంచి దర్శించుకునే అవకాశం కల్పించాలని ప్రతి మంగళ, బుధవారాల్లో లఘు దర్శనానికి ఆయన తెర తీశారు. రాజకీయనేతలు, ప్రజాప్రతినిధుల సిఫార్సుల నియామకాలు, ఉన్నతాధికారుల విచ్చలవిడి సీరియళ్ల రూపకల్పనతో అవినీతిమయమైన ఎస్వీబీసీని గాడిలో పెట్టారు. దీర్ఘకాల ప్రణాళికతో నడిచే సీరియళ్ల కథలను రెండు, మూడు ఎపిసోడ్‌లలో ముగించే విధంగా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు రూ. 25 కోట్ల నిధులను కాపాడగలిగారు.

ఆయన తీసుకువచ్చిన నిర్ణయాల్లో ముఖ్యమైనవి
– ఫొటో యాక్సెస్‌ కార్డు ఆయన మదిలో రూపుదిద్దుకున్నదే. గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకుండా బయటికి వెళ్లి వచ్చేలా యాక్సెస్‌ కార్డు వెసులుబాటు కల్పించారు.
– బంగారుబావి, ఆకాశగంగ నీళ్లను ఆచారంగా తీసుకువచ్చి అభిషేకించే విధానాన్ని సుదీర్ఘకాలం తర్వాత పునఃప్రవేశ పెట్టారు.
– విచక్షణ కోటాతో సహా తోమాల, అర్చన, టికెట్లను రూ.120కి కుదించి ఆ సమయంలోనూ భక్తులకు శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పించారు. ఆ సమయంలో దర్శనం చేసుకునే భక్తులకు ఆయా సేవలను కొద్ది సేపైనా కనులారా వీక్షించే భాగ్యాన్ని కల్పించారు.
– రూ. 34 కోట్లతో దిగువ తరగతి కోసం నిర్వహించే 5,400 గదుల ఆధునికీకరణను చేపట్టారు.
– ధర్మప్రచారంలో భాగంగా స్వామివారి లోక కళ్యానాలను మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లారు. శ్రీవారి ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే సేవలను అక్కడ నిర్వహిస్తున్నారు
– పెద్దఎత్తున చేపట్టిన ఉద్యోగ నియామకాల భర్తీని పారదర్శకతతో పూర్తిచేశారు.
– జీతాలను క్రమబద్ధీకరించారు. అర్చకుల జీతాలను రూ.ఐదు, ఆరు వేల నుంచి రూ. 15 వేలకు పెంచారు. ముఖ్య అర్చకల – జీతాలను రూ.15 నుంచి రూ.30 వేలకు ప్రధాన అర్చకుల జీతాలను రూ.50వేలకు పెంచారు
– అర్చకులకు వంశపారంపర్య హక్కులను పునరుద్ధరించారు.
– తీర్మానాలను వెబ్‌సైట్‌లో పెట్టేందుకు చర్యలు తీసుకున్నారు.
– భక్తులకు అవసరమైన మేర లడ్డూలను పంపిణీ చేసేందుకు ఉత్పత్తి సామర్థాన్ని లక్ష నుంచి మూడులక్షల వరకు పెంచారు.
– సుప్రభాత సేవలో భార్యాభర్తలు కలిసి పక్కపక్కనే ఉంటూ సేవలో పాలుపంచుకునే వెసులుబాటు కల్పించారు. కొత్తగా పెళ్లి చేసుకొని తిరుమలకు వచ్చే నవ దంపతులకు కళ్యాణోత్సవానికి 20 టికెట్లను కేటాయించారు.

అయిన వారికి ఆకుల్లో …
– ఉద్యోగ నియామకాలు, ప్రాధాన్య స్థానాలకు బదిలీల విషయంలో తనకు కావాల్సిన వారికే పెద్దపీట వేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.
– టీటీడీ, ఎస్వీబీసీల్లో ప్రీ ఫిక్స్‌డ్ నోటిఫికేషన్ల కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారనే అభియోగాలు వచ్చాయి.
– తన ఆలోచన తప్పు అని చెప్పే వారిని శత్రువులుగా చూస్తారనే పేరు తెచ్చుకున్నారు.
– తన సామాజిక వర్గానికి మాత్రమే పెద్ద పీట వేశారనే అపవాదు మూటగట్టుకున్నారు.

కొత్త ఈవో ఎల్వీ సుబ్రమణ్యం
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసి టీటీడీ ఈవోగా వచ్చిన కృష్ణారావు స్థానంలో అదే శాఖలో అదే హోదాలో పనిచేస్తున్న ఎల్‌వీ.సుబ్రమణ్యం నియమితులయ్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారి, వివాద రహితుడైన సుబ్రమణ్యంను ఈ స్థానంలో నియమించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చాలాకాలం కిందటే నిర్ణయం తీసుకున్నారు. ఎల్‌వీ.సుబ్రమణ్యం ఈ జిల్లా సత్యవేడు ప్రాంతానికి చెందిన వారు కావడం విశేషం.
Tags: ముఖ్యమైన వార్తలు,

Advertisements
Published in: on June 16, 2011 at 5:01 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/06/16/%e0%b0%ad%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%92%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%a1%e0%b1%81/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: