భక్తులకు చేయగలిగినంతా చేశాం

భక్తులకు చేయగలిగినంతా చేశాం
ఆ ఒక్క అపవాదే అసంతృప్తినిచ్చింది
తితిదే ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు
తిరుమల , జూన్ 15 :
‘శ్రీవారి శీఘ్రదర్శనం కార్యక్రమం అమలుతో ఎన్నో సానుకూల మార్పులు వచ్చాయి. ఎలాంటి సిఫార్సు లేకుండా భక్తులకు స్వామి దర్శనం చేసుకునే అవకాశం కల్పించాం. దళారులను కట్టడి చేయగలిగాం. అక్రమాలు చాలావరకు సమసిపోయాయి. భక్తులపరంగా చేయాల్సిన వసతి కార్యక్రమాలను వెనుకాముందు చూడకుండా అమలు చేశాం. ఇవన్నీ పూర్తిస్థాయిలో సంతృప్తినిచ్చినా శ్రీవారి ఆలయంలో తితిదే సిబ్బంది భక్తులను నెట్టేస్తున్నారనే అపవాదు నుంచి బయటపడటానికి తీసుకోవాల్సిన దీర్ఘకాలిక ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు…’ ఇక్కడి నుంచి బదిలీ అయిన సందర్భంగా తితిదే ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు మంగళవారం రాత్రి అభిప్రాయాలు పంచుకున్నారు. తితిదేలో ఎన్నో సంస్కరణలకు బీజం వేసిన ఈవో మూడు రోజులు తక్కువగా రెండేళ్లు పనిచేశారు. విధి నిర్వహణలో పొందిన అనుభూతులు ఆయన మాటల్లోనే..

ఈవోగా పనిచేసిన కాలంలో పూర్తి సంతృప్తినిచ్చిన కార్యక్రమం ఏది?
ఈవో: నేను బాధ్యతలు స్వీకరించిన సమయంలో అక్రమాలు, దళారుల దందా ఎక్కువగా కనిపించింది. సిఫార్సులు లేకుండా అక్రమాలకు ఆస్కారం లేకుండా భక్తులకు సులభ దర్శనంపై ఆలోచించాను. శీఘ్రదర్శనం పేరిట కార్యక్రమం రూపకల్పన చేశాను. ఆ సమయంలో పాలకమండలిని ఒప్పించాను. ఈ కార్యక్రమం అమలు చేసిన తొలినాళ్లలో విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. కార్యక్రమం క్రమంగా భక్తుల మన్ననలు అందుకుంది. దళారులను చాలావరకు అరికట్టి అక్రమాలకు అడ్డుకట్ట వేయగలిగాం. చంటి బిడ్డల తల్లిదండ్రులకు సులభ దర్శనం విధానం మరువలేని ఘట్టం. స్వామివారి అభిషేకం, తోమాల, అర్చన సేవలను సామాన్య భక్తులు తిలకించే భాగ్యం కల్పన మరువలేనిది.

అసంతృప్తి ఏమైనా ఉందా?
ఈవో: కొంత అసంతృప్తి మనసులో దాగిఉంది. శ్రీవారి ఆలయంలో తితిదే సిబ్బంది భక్తులను నెట్టేస్తున్నారనే అపవాదు మాత్రం నిత్యం వస్తోంది. దీని పరిష్కారం దిశగా తిరుపతిలో గత నవంబరులో రెండు రోజులపాటు సదస్సు నిర్వహించి అభిప్రాయాలు సేకరించాం. విలువైన సలహాలు అందాయి. దీర్ఘకాలిక ప్రణాళికతో ముందడుగు వేయడానికి కార్యక్రమాలు రూపొందించాం. ఆలయంలో కదిలే తివాచీని ఏర్పాటు చేసి సులభంగా స్వామిని దర్శించుకునే ప్రతిపాదన అమలు చేయలేకపోయాననే అసంతృప్తి ఉంది. శ్రీసేవ ప్రాజెక్టును కొలిక్కి తీసుకువచ్చినా ఫలితాలు చూడలేకపోతున్నాననే భావన ఉంది.

కొత్త ఈవోకు మీరిచ్చే సూచనలు?
ఈవో: శ్రీవారి ఆర్జితసేవా టిక్కెట్ల నమోదులో అక్రమాలను ఛేదించాం. వేలాది టిక్కెట్లు రద్దుచేశాం. ఇంకా కొన్నింటిని రద్దు చేయడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. రద్దు చేసిన టిక్కెట్లను సామాన్య భక్తులకు కరెంట్‌ బుకింగ్‌ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలనే సూచన చేస్తున్నా. ఇందులో న్యాయపరమైన సమస్యలను అధిగమించడానికి చర్యలు తీసుకోవాల్సిఉంది.

తితిదే ఈవో బదిలీకి సవాలక్ష కారణాలు
తితిదే ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. 1979 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన కృష్ణారావు 2009 జూన్‌ 18న ఈవోగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఆయనకు అప్పటి ఆర్థికమంత్రి రోశయ్యతో సాన్నిహిత్యం ఉంది. రోశయ్య సీఎం అయిన అనంతరం ఆయనతో బంధం మరింత బలపడింది. రోశయ్య తర్వాత వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డితో ఆదే సంబంధాలు కొనసాగించలేకపోయారు. తితిదేలో ఒక అధికారికి స్థాన చలనం కలిగించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలను ఈవో వెంటనే ఖాతరు చేయకపోవడంతో సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి స్వయానా ఆదేశిస్తేగానీ సదరు అధికారి బదిలీ దస్త్రం కదిలించలేదని చెబుతున్నారు. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా కీలక హోదాల్లో ప్రభుత్వ అధికారులను నియమించడం తితిదే ఉద్యోగుల్లో నిరసనలను రేకెత్తించింది. తితిదే ఈవోగా పనిచేస్తూ బదిలీ అయిన ఐవైఆర్‌ కృష్ణారావు తనకు కొత్తగా కేటాయించిన పోస్టుపై అసంతప్తితో ఉన్నారు. దీంతో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Advertisements
Published in: on June 16, 2011 at 5:00 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/06/16/%e0%b0%ad%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%9a%e0%b1%87%e0%b0%af%e0%b0%97%e0%b0%b2%e0%b0%bf%e0%b0%97%e0%b0%bf%e0%b0%a8%e0%b0%82%e0%b0%a4%e0%b0%be-%e0%b0%9a%e0%b1%87/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: